సర్కారుకు సవాలుగా భూ భారతి చట్టం
- ప్రతి గ్రామం నుండి వందకు పైన దరఖాస్తులు
- ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో పందుపరుస్తున్న రెవెన్యూ అధికారులు
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై భూ సమస్యలు కలిగి రైతులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
సాదా బైనమా, ధరణిలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కానీ తమ సమస్యలకు భూ భారతిలో పరిష్కారం దొరుకుతుందని ఆశతో దరఖాస్తు చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో గ్రామ సభ నిర్వహించిన గ్రామాల్లో ప్రతి గ్రామం నుండి వందకు పైన దరఖాస్తులు వస్తున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను తహసిల్దార్లు ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఉన్నతాధికారులకు పక్కా సమాచారాన్ని చేరవేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని తాహసిల్దార్ స్థాయిలో పరిష్కారం దొరికే సమస్యలు ఉన్నాయి. మరికొన్ని రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయి వరకు పంపవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి పరిష్కరించలేని భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లన్నారు. దీంతో భూభారతి చట్టంలో మూడంచెల పద్ధతిలో సమస్యల పరిష్కారానికి దారి దొరకడంతో రైతులు గడిచిన10 సంవత్సరాలలో పరిష్కారం కానీ సమస్యలు భూ..భారతిలో పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తహసిల్దార్లు గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సుల వివరాలను వెల్లడించారు. గ్రామాల్లో ఒక రోజు ముందు టాం టాం వేస్తూ రైతులను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
సర్కారుకు సవాల్ గా నూతన రెవెన్యూ చట్టం ..
సర్కారుకు భూ భారతి చట్టం సవాలుగా మారింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో మంత్రులు ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్ లో పాల్గొని లోటు పాట్లను గుర్తించి రైతులకు పరిష్కారం చూపించే విధంగా నూతన చట్టాన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులకు సిసిఎల్ నుంచి కచ్చితంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. రైతులు చేసుకునే దరఖాస్తులను ఇస్టారీతిన తిరస్కరించ వద్దని ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సిసిఎల్ఏ అధికారులు తెలిపారు. నూతన చట్టంలో ప్రభుత్వ భూములకు పూర్తి రక్షణ దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు.
గ్రామ పాలన అధికారుల నియామకం..
ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ పాలన అధికారి నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న విఆర్వోలు, విఆర్ఏలకు రాత పరీక్ష నిర్వహించారు. వీరిని రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావడానికి పరీక్ష నిర్వహించి, అర్హులైన వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో గ్రామ పాలనా అధికారులు (జిపిఓ) విధుల్లో చేరనున్నారు.
సర్వేయర్ల నియామకం ..
నూతన చట్టంలో ప్రతి రిజిస్ట్రేషన్ కు నక్ష మ్యాప్ జతపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సర్వేయర్లను నియమించి వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో ప్రతి రిజిస్ట్రేషన్ కు ఒక రోజు ముందు సర్వేయర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్ పక్కగా జరుగుతుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జిపిఎస్ ఆధారంగా రిజిస్ట్రేషన్ కు ఒక రోజు ముందు సర్వేయర్లు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్కింగ్ చేసి మ్యాప్ ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో కొనుగోలు చేసే వారికీ పక్క రైతుల నుండి భవిషత్తులో ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజు రెవెన్యూ సదస్సులను పరిశీలిస్తూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తెలుసుకుంటున్నారు. నూతన రెవెన్యూ చట్టంలో రైతుల సమస్యలు తొలగిపోయి, ప్రభుత్వ భూములకు రక్షణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా పూర్తయ్యే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నందుకు రైతుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది.

