హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే ప్రాజెక్టుల పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు పరిహారం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్ట్, పరకాల నియోజక వర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్ట్ ల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే ప్రాజెక్ట్ లకు సంబంధించి కొనసాగుతున్న భూసేకరణ, పరిహారం చెల్లింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రాజెక్ట్ లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తయ్యేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

