నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 10,భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మరికల్ మండలంలోని మాద్వార్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. తహాసిల్దార్, నాయబ్ తహాసిల్దార్ నేతృత్వంలోని రెండు బృందాలు ఏర్పాటుచేసి రోజూ ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మాధ్వార్ సదస్సులో ఏ ఏ భూ సమస్యలు ఎక్కువ వచ్చాయని మరికల్ తహాసిల్దార్ రామ్ కోటి ని అడిగి తెలుసుకున్నారు. బల్క్ గా ఏ సమస్య వచ్చిందని అడిగారు. ఎక్కువగా మిస్సింగ్ సర్వే నంబర్లు, పెండింగ్ మోటేషన్, తప్పుడు పేర్ల నమోదు, పూర్తిస్థాయిలో భూమి నమోదు కాకపోవడం లాంటి సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని తహాసిల్దార్ తెలిపారు. అయితే అక్కడికక్కడే పరిష్కరించే భూ సమస్యల దరఖాస్తులను క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. –

