హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధికి కృషి* వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు* నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న రోగుల సహాయకుల భవనం, బ్లడ్ బ్యాంక్ ప్రధాన గేట్ పక్కన ఉన్న ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ప్రసూతి ఆసుపత్రిలో ఓపి సేవలను, స్కానింగ్ రూమ్, ప్రసవానంతర వార్డులను పరిశీలించారు. ప్రసవానంతర వార్డు లోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి లోని సెమినార్ హాల్ లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పేషంట్ బెడ్ల సంఖ్య, రోజుకు ఓపీ సేవలకు వస్తున్న వారి సంఖ్య, ఇప్పుడున్న వసతులు, వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు వస్తున్న బడ్జెట్, తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున ఆస్పత్రి నిర్వహణ బాగుండాలని అన్నారు. ఆసుపత్రిలో తాగునీరు , పారిశుధ్య నిర్వహణ బాగుండాలన్నారు. ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందించే విధంగా ఒక పాథాలజిస్ట్ అందు బాటులో ఉండే విధంగా కేటాయించాలన్నారు. ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. నియోనాటల్ విభాగం ఉన్నందున అందుకు సరిపోను మందులు, వైద్య ఉపకరణాలు ఉండాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన ప్రతి పాదనలు తమకు అందించి నట్లయితే ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఔషధాలు పంపిణీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాసెక్టమి శిబిరాలను నిర్వహించాలని అలాగే డాక్టర్లకు డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ సంబంధించిన శిక్షణ అందించాలని వైద్య అధికారులకు సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధికి, వసతులు కల్పనకు తగిన ప్రతిపాదనలు వైద్యాధికారులు అందజేయాలని అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రి బెడ్ల సంఖ్య, భర్తీ చేయాల్సిన వైద్యులు, సిబ్బంది సంఖ్య, ఇతర వసతులను కల్పించేందుకు సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం కేటాయించే నిధులను అవసరమైన ఆసుపత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కు వినియోగించాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి ప్రసూతి, వైద్య సేవలు నిమిత్తం ఎక్కువ మంది వచ్చే విధంగా కృషి చేయాలని ఆస్పత్రి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ ప్రసవాలు అయ్యేవిధంగా దృష్టి సారించాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో ఆశా కార్యకర్తల ద్వారా ప్రసూతి సేవలు పొందేవిధంగా వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి బడ్జెట్, అభివృద్ధి, మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి, వసతులు, బడ్జెట్, వైద్యులు సిబ్బంది, తదితర అంశాలను సమీక్షా సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఆసుపత్రి కి కావాల్సిన మౌలిక వసతుల గురించి ప్రతిపాదనలు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. వారం పది రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రానున్నారని అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలతో ఎమ్మెల్యే లతో కలిసి ముందుగా వైద్య ఆరోగ్య మంత్రిని, ఆ తదుపరి సీఎం దృష్టి కి తీసుకెళ్లి ఆసుపత్రి అభివృద్ధి కి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం 2009లో జరిగిందని, ఇప్పుడు 16 ఏళ్ల తరువాత మళ్ళీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామనడానికి ఇదొక నిదర్శనం అని అన్నారు. సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాల ఫలితాలను త్వరలోనే చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, కెఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు, అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

