Tuesday, January 20, 2026

కన్న కొడుకే కన్నం వేశాడు

తన సొంత ఇంటిలోనే 16 తులాల బంగారం అపహరణ చేసిన వైనం

  • 24 గంటల్లోనే కేసును చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు
  • చోరీ చేసిన బంగారం, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడని అంటారు. కానీ ఆ నానుడి సరికాదని చూపారు మిల్స్ కాలనీ పోలీసులు. తన ఇంట్లోనే దొంగతనం చేసిన ఇంటి దొంగని 24 గంటల్లోనే పట్టుకున్నారు. కేసు వివరాలను మంగళవారం వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణకు భార్య సవిత రాణి, కుమారుడు జయంత్, కుమార్తె శ్రీనిధి ఉన్నారు. ఈనెల 8వ తేదీన గుర్రం రామకృష్ణ భార్య, కుమార్తెతో కలిసి హైదరాబాదులో ఓ శుభ కార్యానికి వెళ్ళాడు. ఫంక్షన్ ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. బీరువా తాళాలు తెరచి ఉండగా అనుమానంతో లోపల వెతకగా అందులో ఉండవలసిన ఆరున్నర తులాల హారం, ఐదున్నర తులాల చిన్న హారం, రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్ మొత్తం 16 తులాల బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయి. దీంతో కంగుతిన్న బాధితుడు వెంటనే మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ జోన్ డిసిపి సలీమా బేగం ఆదేశాల మేరకు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ మరియు సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఫోర్ట్ రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడు పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి 11.16 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. నిందితుడు జయంత్ (23) హనుమకొండ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బిబిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఒక అమ్మాయి తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ జల్సాలకు డబ్బులు అవసరం అవ్వడం మరియు గతంలో హైదరాబాదులో ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి నష్ట పోవడంతో, చేసిన అప్పులు తీర్చడం కష్టంగా మారడంతో సొంత ఇంట్లోనే దొంగతనానికి పూనుకున్నాడు. ఇంట్లో వారు ఫంక్షన్కు వెళ్లగా అదే అదునుగా భావించి ఇంట్లోని బంగారం దొంగతనం చేసి కొంత బంగారం కరిగించి అమ్ముదామని తీసుకెళ్తుండగా పోలీసు వారు పట్టుకున్నారు. దొంగతనం కేసు చేదించడంలో ప్రతిభ కనబరచిన మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ లు శ్రీకాంత్, సురేష్, కానిస్టేబుల్ లు ప్రవీణ్ రెడ్డి, వాజిద్ పాషా, నరేందర్, హోంగార్డు రఫీ మరియు ఇతర సిబ్బందిని వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ ప్రత్యేకంగా అభినందించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి

– ఎసిపి నందిరామ్ నాయక్

తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చిన పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వరంగల్ ఎసిపి నందిరామ్ నాయక్ తెలిపారు. టీనేజ్లో ఉన్నప్పుడు చెడు అలవాట్ల పట్ల యువత తొందరగా ఆకర్షితులు అవుతారని తద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి జైలు పాలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిగతులపై దృష్టి సారించాలని, వారితో సన్నిహితంగా ఉంటూ సన్మార్గంలో ఉండేలా ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఏసీపీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News