Tuesday, January 20, 2026

భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి* ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ న్యూ శాయంపేట పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమం* *ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, విద్యాశాఖ అధికారులు*నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండ న్యూ శాయంపేట లోని పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఎంపీ, కలెక్టర్ మొక్కలు నాటి నీళ్ళు పోశారు. పాఠశాల ఆవరణలోని మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు, ముందు తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరికీ విద్య అనేది అందుబాటులో ఉండాలన్నారు. సాధారణమైన విద్య కాకుండా నాణ్యమైన విద్యా బోధనా అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందని, క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నిబద్ధత, జవాబు దారితనం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు చదువులతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు సన్నద్ధమై పాఠ్యాంశాలను బోధించాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులు ఎప్పటి కప్పుడు ప్రేరణ పొందుతూ ఉండాలన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెలియజేసినట్లు వెల్లడించారు. తనకు విద్య, వైద్యం అనేవి రెండూ చాలా ఇష్టమైనవని పేర్కొన్నారు. విద్య వైద్య కార్యక్రమాలకు ఎప్పుడు పిలిచినా కూడా తప్పనిసరిగా వెళ్తానని చెప్పారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల డీఈవోలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు రావడానికి, వచ్చిన పిల్లలని విద్యాపరంగా ఎలా అభివృద్ధి చేయాలి, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం, పాఠశాలలో తాగునీరు సరఫరా, టాయిలెట్స్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం ఇలా అనేక అంశాలపై డీఈవోలతో నిర్వహించిన సమావేశంలో చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద జిల్లా, రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మిగతా రంగాల కంటే విద్యా బోధనలో ఎంతో ఆనందం ఉంటుందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఈ పాఠశాలను మోడల్ స్కూల్ లా తీర్చిదిద్దాలన్నారు. ఎంపీగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు సహాయాన్ని అందజేస్తాం అని పేర్కొన్నారు. గతంలో తన ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, ఇతర సామగ్రిని అందించేదని చెప్పారు. గతంలో ఫౌండేషన్ చైర్పర్సన్ గా పాఠశాలకు రెండుసార్లు వచ్చానని, ఇది పాఠశాలకు ఇప్పుడు ఎంపీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజున పాఠశాలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. *ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ* ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన సాగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలన్నారు. ప్రతి తరగతి గదిలో ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 135 పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్యూటర్ బోధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణతో విద్యార్థులలో పురోగతి కనిపిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ పాఠశాలల చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. విద్యార్థుల చదువుతో పాటు వారి ప్రవర్తన లోను మంచి మార్పులు తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. *జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి* మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం విజన్- మిషన్ తో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల భావి జీవితానికి ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాల బోధన చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ఇస్తున్నట్లు చెప్పారు. బడిలో భాగస్వామ్య మైనప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు కూడా ప్రచారంలో భాగస్వామ్యం కావాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పలయ్య మాట్లాడుతూ పాఠశాలలో 200 పైగా విద్యార్థుల నమోదు శాతానికి పెంచేందుకు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 30 మందికి పైగా విద్యార్థులు పాఠశాలలో చేరినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సాగుతున్న విషయాన్ని తెలియజేస్తూ రూపొందించిన కరపత్రాలతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ ఎంపీ, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోజ్ కుమార్, కాజీపేట పురుషోత్తం, శ్రావణ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాధ, తదితరులతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News