హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఖనిజ అనుమతుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం*నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)ప్రభుత్వ పనులకు సంబంధించి చిన్న తరహా ఖనిజాలైన కంకర, మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ విధానం ద్వారా అనుమతులు తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఇసుక, కంకర, తదితర ఖనిజ వనరులకు సంబంధించి ఆన్లైన్ జీరో పర్మిట్ సిస్టం, టీజీఎండిసి ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై మైనింగ్, టీజీఎండిసి, రెవెన్యూ, పోలీస్, రవాణా, తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక, మట్టి, కంకర, చిన్న తరహా ఖనిజ వనరులు, అనుమతులు తదితర మైనింగ్ అంశాలకు సంబంధించిన వివరాలను జిల్లా మైనింగ్ శాఖ ఏడి రవిశంకర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆన్లైన్ జీరో పర్మిట్ ను అధికారులు అమలు చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆన్లైన్ జీరో పర్మిట్ కు దరఖాస్తు చేసినట్లయితే వెంటనే ఆమోదించాలన్నారు. తద్వారా జీరో ఆన్లైన్ పర్మిట్ విధానం ఏర్పరచి ఎక్కడ కూడా అక్రమ ఖనిజ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నట్లవుతుందన్నారు. ఇంజనీరింగ్ శాఖలకు ఎంత మేరకు ఇసుక అవసరం అవుతుందో విధిగా టీజీఎండిసికి సమర్పించాలన్నారు. 1,2 ఆర్డర్ల వాగులలో ఇసుక అక్రమ రవాణా, ఇసుక వెలికితీతకు సంబంధించి జిల్లాలో పరిపాలన పరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అవసరం ఎంతో ఉందని, సాండ్ బజార్ ద్వారా ఆన్లైన్లో తీసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ధర్మసాగర్, హసన్ పర్తి, ఆత్మకూర్ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపయోగపడే విధంగా సాండ్ బజార్ కోసం 5 ఎకరాల చొప్పున గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం నుండి ఇందిరమ్మ ఇండ్లకు కావలసిన ఇసుకను తీసుకునేందుకు లబ్ధిదారులకు కూపన్లను అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల నిమిత్తం లబ్ధిదారులకు ఒక రేటు ప్రకారమే ఇండ్ల నిర్మాణ పనులు చేసే విధంగా మండల స్థాయిలో ప్రైస్ కమిటీ ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ కూడా ఇష్టారీతిన ఇసుకను, చిన్న తరహా ఖనిజాలు తీయకుండా అధికారులు కాంట్రాక్టర్లకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇసుక విధానం, అనుమతులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి.గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, ఏసీపీలు, వివిధ ఇంజనీరింగ్ విభాగాల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

