నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)
సింగరేణి లో కార్మికులను, గుర్తింపు కార్మిక సంఘాన్ని అవమాన పరుస్తూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి గులాంగిరి చేస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. శుక్రవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… సింగరేణి లో ఏఐటియుసి గెలిచిన తరువాత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు డిమాండ్ లను యాజమాన్యం ముందు పెట్టడం జరిగిందని అందులో భాగంగా సింగరేణి కార్మికుల పిల్లలు సింగరేణి లో ఉన్న స్కూల్లో విద్యా సౌకర్యాలు బాగా లేదని, లక్షల రూపాయలు వెచ్చించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ప్రైవేటు స్కూల్స్ లో చదివిస్తున్నారని, దీని వల్ల చిన్న పిల్లలు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని కార్మికులు మా దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆలోచన మేరకు సింగరేణి యాజమాన్యం తో జరిగిన స్ట్రక్చర్ సమావేశం లో సిబిఎస్ఇ సిలబస్ ను సింగరేణి లో ప్రవేశ పెట్టాలని ఏఐటియుసి డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. ఏఐటియుసి చేసిన డిమాండ్ యాజమాన్యం సింగరేణి లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్ లలో సిబిఎస్ఇ సిలబస్ ను ప్రవేశపెడుతామని అంగీకరించి, దానికి సంబంధించిన అన్ని అనుమతులు యాజమాన్యం తీసుకోవడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా రామగుండం రీజియన్ పరిధిలోని సెక్టార్ త్రీ లో ఉన్న సింగరేణి స్కూల్ నందు శుక్రవారం సిబిఎస్ఇ సిలబస్ ను ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యాజమాన్యం ప్రచురించిన ఆహ్వాన పత్రిక లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు పైన పెట్టారని, కింద చిన్నగా సి అండ్ ఎండి, డైరెక్టర్ ల పేర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పేర్లు ముద్రించి కార్మికుల ను, గుర్తింపు సంఘాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి గులాం గిరి చేస్తుందని ఆరోపించారు. సిబిఎస్ఇ సిలబస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కు ఏం సంబంధం అని ప్రశ్నించారు, సింగరేణి సొమ్ము తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవసరం ఏమిటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సింగరేణి లో ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం, పదవులు కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కు ఊడిగం చేస్తూ సింగరేణి సంస్థ ను నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, అధికారులు తమ విధానాలను మానుకోవాలని, లేకుంటే కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, ఆర్జీ టూ కార్యదర్శి జీగురు రవిందర్, శ్రీరాంపూర్ బ్రాంచి కార్యదర్శి బాజిసైదా, నాయకులు రంగు శ్రీను, సిర్ర మల్లికార్జున్, కారంపూడి వెంకన్న, ఆకునూరి శంకరయ్య, సూర్య, దాసరి శ్రీనివాస్, బలుసు రవి, ఎం.ఎ.గౌస్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

