Wednesday, January 21, 2026

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షు మామిడి సోమయ్య
  • విజయవంతంగా జనగామ జిల్లా మహాసభ
    నేటి సాక్షి-జనగామ:
    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు నిర్వర్తించిన పాత్ర కీలకమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని అన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన
    డిమాండ్ చేశారు. గురువారం జనగామలోని గాయత్రి గార్డెన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా..
    జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన ప్రకటించారు. సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పాలకుల పక్షం కాదని, ఈ సంఘం ఏ ఒక్క పత్రికకు,పార్టీకి అనుబంధం కాదని మామిడి సోమయ్య స్పష్టం చేశారు.
    రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని ఆయన విమర్శించారు. జర్నలిస్టులందరికీ ఉపయోగపడాల్సిన మీడియా అకాడమీని యూనియన్ సంస్థగా మార్చి తమ స్వప్రయోజనాల కోసం జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
    అలాంటి జర్నలిస్టు సంఘాల పట్ల యావత్ జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, చాలా ఏళ్ళుగా నడుస్తున్న అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న అన్ని చిన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, జనగామ జిల్లాలో ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం జర్నలిస్టుల సమస్యలపై నిరంతం పోరాడుతూ, జర్నలిస్టులకు అండగా ఉంటుందని వారన్నారు. సన్నాహక కమిటీ కన్వీనర్ నరేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ
    మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, జనగామ జిల్లా కార్యదర్శి ఎనమల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు.
    టీడబ్ల్యూజేఎఫ్ జనగామ జిల్లా కార్యవర్గం ఎన్నిక..
    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నీలా నరేష్ బాబు (మెట్రో), ప్రధాన కార్యదర్శిగా చింతకింది కృష్ణమూర్తి (స్పాట్ వాయిస్), కోశాధికారిగా కూచన సుప్రీమ్ (టి ఛానల్ ), జిల్లా ఉపాధ్యక్షులుగా చింతల మధు కృష్ణ (మన సాక్షి గొంతుక), గంగరబోయిన జానకి రాములు(దిశ), నాసగోని శ్రీనివాస్(ప్రజాదర్బార్), కార్యవర్గ సభ్యులుగా జాజాల బాలయ్య (తెలుగు ప్రభ), భాగిర్తి నరేష్ (ప్రజాదర్బార్ )వేముల నరసింగం (జ్యోతి), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వల్లాల జగన్ (స్కైలైన్). ఎనమల్ల సత్యనారాయణ(జనం సాక్షి), నారబోయిన గోపాల్ (జనం సాక్షి), ఐఎఫ్ డబ్ల్యు జే జాతీయ కౌన్సిల్ సభ్యులుగా గూడూరు లెనిన్ (ప్రజాజ్యోతి) ఏకగ్రీవంగా
    ఎన్నికయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News