జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
పీడియాట్రిక్ విభాగంలో దాతలతో కలసి పరికరాలను ప్రారంభించిన కలెక్టర్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
ఎంజీఎం ఆసుపత్రిలో పీడియాట్రిక్ విభాగానికి పరికరాలు అందించిన దాతల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. శుక్రవారం యంజీఎం ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగానికి బిలియన్ హాట్స్ బ్రీతింగ్ ఫౌండేషన్, జనప్రియ సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద 60 లక్షల రూపాయల విలువ చేసే పీడియాట్రిక్ విభాగానికి అవసరమయ్యే ఎక్స్ రే, ఈ సీజీ మెషిన్, పారా మానిటర్లు, డబుల్ సర్ఫేస్ ఫోటో థెరపీ వంటి 13 వివిధ రకాల పరికరాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తీస్గడ్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ మహాత్మా గాంధీ ఆసుపత్రిలో సి ఎస్ ఆర్ కింద దాతలు అందించిన పరికరాల వల్ల ఎన్ఐసీయూ, ఎస్ ఎన్ సి యు పీడియాట్రిక్ విభాగాలు బలోపేతమై చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు తోడ్పడుతాయని అన్నారు. దాతలు ముందుకు వచ్చి మరింత ఉదారత వహించి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలను కల్పించాలని కలెక్టర్ కోరారు. ఆసుపత్రి ద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు గత సంవత్సరం కాలం నుండి తరచుగా తనిఖీలు చేస్తూ ఆసుపత్రి బలోపేతం, మెరుగుదలకు కృషి చేయడం జరుగుతున్నదని అన్నారు. అనంతరం ఎంజిఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో దాతలకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిలియన్ హార్డ్స్ బ్రీతింగ్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ సుధా జిజారియా, జనప్రియ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎండి సతీష్ కుమార్, ఎంజీఎం పర్యవేక్షకులు కిషోర్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్ఎం ఓ లు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

