బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
- దేశాయిపేట, కేయూసి ఫిల్టర్ బెడ్ లలో ఆకస్మిక తనిఖీ
- రీసైక్లింగ్ హబ్ పనితీరును పరిశీలించిన కమిషనర్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పరిధిలోని దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ తో పాటు కాకతీయ యూనివర్సిటీ (కేయుసి) ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించి నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకుని సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ లో నీటి లభ్యత, నాణ్యత నిర్ధారణ పరీక్షల తీరు తదితర అంశాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోర్ సిటీ తో పాటు విలీన గ్రామాలకు నీరు సరఫరా అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సూచనలు చేస్తూ నీటి సరఫరా లో ఏమైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా లో ఆటంకం లేకుండా చూడాలని, వర్షాకాలం నేపథ్యంలో నీరు కలుషితం కాకుండా ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. కే యూ సి ఫిల్టర్ బెడ్ సందర్శన క్రమంలో ఇట్టి ఆవరణ లో గల రీసైక్లింగ్ హబ్ (సెంట్రల్ హబ్) ను కమిషనర్ సందర్శించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు తగు సూచనలు చేస్తూ నగర వ్యాప్తంగా ఉన్న 21 డి ఆర్ సి సి ల నుండి పొడి చెత్త యందు గల వివిధ రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను వేరు చేసి ఎప్పటికపుడు ప్లాస్టిక్ వ్యర్థాలను కంపెనీ లకు పంపిస్తూ సెంట్రల్ హబ్ ను మరింత బలోపేతం చేయాలని, అదనంగా మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ వ్యర్ధాలను ప్యాకింగ్ చేసి కంపెనీలకు ఎగుమతి చేయాలని అన్నారు. ఐఈసి కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ 18 రకాల వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఒక దారంకు కట్టి ప్రదర్శిస్తూ అన్ని పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించిన కమిషనర్ ఇన్ వార్డు, ఔట్ వార్డుకు సంబంధించిన రికార్డ్స్ తో పాటు వేవింగ్ మిషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ డా. రాజారెడ్డి ఈ ఈలు శ్రీనివాస్, రవికుమార్ డి ఈ లు రాజ్ కుమార్, కార్తీక్ రెడ్డి, ఏఈ లు హరికుమార్, సరిత, శానిటరీ సూపర్ వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాషా నాయక్, అనిల్, వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.

