- ఒకరు అరెస్టు
- రవాణాకు ఉపయోగించిన కారు స్వాధీనం
- రంగంపేట వద్ద సంఘటన
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమ రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలతో పాటు, వాటిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకుని, ఒకరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణతో టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ జి. బాలిరెడ్డి మార్గానిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ లింగాధర్ టీమ్ శుక్రవారం నుంచి భాకరాపేట సెక్షన్ నాగపట్ల బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శనివారం తెల్లవారుజామున రంగంపేట – శ్రీనివాస మంగాపురం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులను చూసి కారు ఆపి ఒక వ్యక్తి దిగి పారి పోతుండగా అతనిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో 24ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 20 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. దుంగలు సహా అరెస్టు అయిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి అతనిని విచారించగా, ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.