కొత్త సంవత్సరంలోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మించాలి..
– 76 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి చర్యలు
– ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు పంపిణీ..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
మిడ్ మానేర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి వేములవాడ అగ్రహారం వద్ద గల శ్రీ ఫంక్షన్ హాల్ లో మిడ్ మానేర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇల్లు కట్టుకొని ఖాళీ ఫ్లాట్స్ ఉన్నవారికి స్పెషల్ కోటా కింద 847 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో మంజూరు చేశామని, వీటిలో వేములవాడ నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికే పంపిణీ చేశామని, స్పెషల్ కోట కింద మిడ్ మానేరు నిర్వాసిత గ్రామాల ప్రజలకు నేడు 847 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, మరో 3 వేల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పెండింగ్ విచారణలో ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో మిగిలిన వారికి తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
వేములవాడ అర్బన్ ప్రాంతంలోని ముంపు గ్రామాల రిజర్వాయర్ నిర్వాసితులకు తప్పనిసరిగా ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితుల శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా మనమంతా సంయుక్తంగా పని చేయాలని అన్నారు. భారత దేశంలో ఎక్కడ కూడా పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పెద్ద ఎత్తున పేదలకు నిధులు మంజూరు చేస్తుందని అన్నారు.
76 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుందని అన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ప్రభుత్వ విప్ ధ్వజమెత్తారు.
ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించామని అన్నారు.
వైయస్సార్ జయంతి సందర్భంగా ఆయన హయాంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను కొనసాగిస్తూ అదనంగా పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. పేదలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డుల జారీ చేస్తున్నామని అన్నారు.
500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, 25 లక్షల రైతులకు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40% డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల చేపట్టామని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద వ్యాపార యూనిట్ల ప్రత్యేకంగా మంజూరు చేసేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ తెలిపారు. పేదల పట్ల కారుణ్యం తో జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, స్టేట్ రిజర్వు నుంచి మొట్టమొదటి సారిగా 5 వేల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వ విప్ ప్రత్యేక చోరువతో మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే చెల్లింపు లలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.అమ్మ నాన్న చనిపోయిన కేసులలో పిల్లలకు ఆ ఇల్లు వచ్చేలా చూస్తామని అన్నారు. నేడు 847 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నామని, వీరు కొత్త సంవత్సరం లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, నాయకులు లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.