బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఎలుక భగవాన్*నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* బీసీ రిజర్వేషన్ లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎలుక భగవాన్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా భగవాన్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, బీసీ కుల సంఘాలు ఈ బంద్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ, అట్టి జీవోపై హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ బీసీ కులాల నోటికాడి ముద్ద లాగేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదేమోనన్న అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశారు. ధర్మాసనంపై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని, బీసీలు ఎంతో బీసీల వాటా ఎంతో తెలిచాల్సిందేనని బీసీ సంఘాలన్నీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయని, దీనిని అన్ని బీసీ సబ్బండ వర్గాలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు.





