నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి రూరల్ రకరకాల టపాకాయల మోతలు.. రంగురంగుల వెలుగులతో కళ్లు మిరమిట్లు గొలిపేలా కాంతులు.. దిక్కులు పిక్కట్టిల్లేలా టాపాసుల శబ్ధాలు.. భక్తుల కోలాహలం మద్యన కళ్లెదుటే నరకాసురుడి దహనం.. ఇళ్ల ముంగిట దీపపు కాంతులతో తుమ్మలగుంటలో నరక చతుర్ధశి వేడుకలు సోమవారం అత్యంత వేడుకగా జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రతి ఏటా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నరక చతుర్ధశి రోజున నరకాసురవధ నిర్వహించడం ఆనవాయితీ. గత 18ఏళ్లుగా జరిపించే ఆ నరకాసుర వధ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 52 రకాలతో కూడిన 2 లక్షల టపాకాయలను ఉపయోగించి నరకాసురుని ప్రతిమను ఆకట్టుకునేలా తయారు చేశారు. 20 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి వచ్చిన 10 మంది కార్మికులు ప్రత్యేకంగా తెప్పించిన టపాకాయలతో నరకాసురుడి ప్రతిమను రూపొందించారు. ఆ ప్రతిమను తయారు చేయడానికి 7రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఆలయం ముందు నరకాసురుని ప్రతిమను నిలబెట్టి ముందుగా పూజలు చేసిన తరువాత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేతులు మీదుగా నరకాసురుని ప్రతిమ దహనానికై దీపంతో ముట్టించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథరెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, తుమ్మలగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జయచంద్రా రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తులసీరెడ్డి, గణపతిరెడ్డి, బుజ్జిబాబులతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. *చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా…*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటున్నారని తుడా మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏటా ఆలయం వద్ద ఘనంగా దీపావళి పండుగ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. దీపావళి పర్వదినాన ప్రజలందరికీ నరకాసురవధ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్న విషయాలను తెలియపరచడానికి ఈ ఘట్టం ఉపయోగ పడుతుందన్నారు. ప్రతి ఏటా జరిగే దీపావళి వేడుకల్లో ప్రజలందరితో సంతోషంగా గడిపే తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షకట్టి అక్రమ కేసులో 125 రోజులుగా జైలులో నిర్భంధించడం తమ మనసును బాధిస్తోందని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. దీపావళి పండుగ వేళ ఆయనను జనం మద్యన లేకుండా చేశారన్న బాధ తప్ప ఆయన ఆదేశాలతో ఆలయం వద్ద ఏలాంటి కార్యక్రమాలు ఆగకుండా నిర్వఘ్నంగా పూర్తి చేస్తున్నామన్నారు. అంతకుముందుగా తమ ఇంటి వద్ద ఆయుధపూజను ఘనంగా నిర్వహించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు వాహనాలకు హారతులు పట్టి ముందుకు కదిలించారు. *వేద పాఠశాలలో దీపావళి సంబరాలు*శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు అనుబంధంగా నడిపే వేదపాఠశాలలో చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు ప్రత్యేకంగా అక్కడి పిల్లల చేత టపాకాయలు పేల్చి సంబరాలు జరిపారు. ప్రతి ఏటా చెవిరెడ్డి పిల్లలతో కలసి టపాకాయలు కాల్పించే వారని, ఈ ఏడాది ఆయన అందుబాటులో లేనందున చెవిరెడ్డి కుటుంబీకులు ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు.





