*రామచంద్రాపురం పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యతా పరుగులో వెరిటాస్ సైనిక్ పాఠశాల విద్యార్థులు* *రామచంద్రాపురం* రామచంద్రాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెరిటాస్ సైనిక స్కూల్, స్థానిక యువత, ప్రజలు 240 మంది విధ్యార్థినీ విద్యార్థులతో , సిబ్బందితో ఐక్యతా పరుగును స్థానిక ఎస్సై భక్తవత్సలం పచ్చజెండా ఊపి ప్రారంభించారు.. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా మండలం లో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పోలీసుల ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని, దేశ మొట్టమొదటి హోం మంత్రి, ఉక్కుమనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, ( జన్మదిన వేడుకలు) ఐక్యతా పరుగు, ప్రతిజ్ఞ, కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని ఎస్సై భక్తవత్సలం కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ దినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటామని, విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయమని, బ్రిటీషర్లు భారత్‌ను విడిచి వెళ్లాక దేశ రక్షణ, సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కుమనిషి అనే గుర్తింపు వచ్చిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు అమోఘమని, స్ఫూర్తిదాయకమని, భిన్న జాతులు, భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్నా భారత దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. హోంమంత్రిగా శాంతిభద్రతలను పరిరక్షించి అసలైన లౌకిక దేశాన్ని పునర్నిర్మించారని ఎస్సై పేర్కొన్నారు. అనంతరం ఎస్సై భక్తవత్సలం పోలీస్ సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు మరియు ప్రజలు అందరిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సి రాజశేఖర్, వెంకటేష్, మహేష్, రాజేష్, బాబు, ధనుంజయులు, సుధాకర్,స్థానిక యువత, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

