Sunday, March 15, 2026

*మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు, రిజర్వేషన్లు పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి** రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధివిజయవాడలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాజీ సైనికులకు సంబంధించిన పలు అంశాలపై మీడియా మిత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియ జేస్తూ పది కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించటం సంతోషదాయకమైనప్పటీకి, సంవత్సరం ఆరునెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయక పోవటం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ, దశాబ్దాలుగా మాజీ సైనికులు ఎదురు చూస్తున్న మాజీ సైనికుల కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితం అవ్వటం పట్ల మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి చెందుతున్నారని తెలియ జేశారు. ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి కేసులు లేని మాజీ సైనికుల నే కార్పొరేషన్ సభ్యులుగా ఎన్నుకోవాలి.పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటం మరియు కొన్ని జిల్లాలకు పేర్లు ఖరారు కోసం ప్రభుత్వం ఒక కమిటిని కూడా నియమించడం స్వాగతించవలసిన విషయమే. అయితే, జిల్లాలకు పేర్లు ఖరారులో అనేక యుద్ధాలలోనూ మరియు దేశ రక్షణలోనూ బలిదానాలు చేసిన వీర సైనికుల పేర్లను కూడా జిల్లాలకు పెట్టడానికి పరిగణన లోకి తీసుకోవాలి.ప్రస్తుత ఆధునిక భారత దేశంలో సైనికులు కానీ మాజీ సైనికులు కానీ అన్ని రంగాలలో ప్రావీణ్యత పొంది ఉంటున్నారు కాబట్టి, అర్హులైన మాజీ సైనికులకు ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కల్పించే విదంగా కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న రిజర్వేషన్ లను పెంచి గతంలో ఉన్నట్లు పది శాతానికి పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కాబడుతున్న హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి వలన మాజీ సైనికుల కు సరైన న్యాయం జరగట్లేదు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిని ఎత్తి వేసి సాధారణ పద్ధతిలో మాజీ సైనికుల కు రిజర్వేషన్ లు అమలు చేయాలి. వార్ విడోస్ కు విడోస్ కు కూడా రిజర్వేషన్ లలో ప్రత్యేక మైన అవకాశాలు కల్పించాలి.రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు( వరదలు, తుఫాన్ లు లేక అల్లర్లు) సంభవించినప్పుడు పోలీసు వారికి సహకరించటానికి అన్ని రంగాలలోనూ ఉత్తమమైన శిక్షణ పొందిన మాజీ సైనికులను ఉపయోగించుకోవటానికి పోలీసు శాఖ లో మాజీ సైనికులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలి.దేశ సేవ దృష్ట్యా అనేక ప్రాంతాల్లో చదువుకునే మాజీ సైనికుల పిల్లలకు మన సొంత రాష్ట్రంలో స్థానికులు గా గుర్తించకపోవడం చాలా బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన సైనికుల పిల్లలు ఎక్కడ చదువుకున్న స్థానికులుగా గుర్తించాలి.మాజీ సైనికులు రిటైర్మెంట్ తర్వాత మూడు సంవత్సరాల లోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపు కు అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి, మాజీ సైనికులు ఎప్పటికైనా మాజీ సైనికులు గానే పిలవబడతారు కాబట్టి తన జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విదంగా జి ఓ ను సవరించాలి.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు రాజకీయ రంగాన కూడా మాజీ సైనికులకు/మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ కల్పించాలి.రాష్ట్రంలో కొన్ని చోట్ల మాజీ సైనికులపై మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యుల పై జరుగుతున్న దురాగతాలను దాడులను అరికట్టే విదంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దేశ సేవకులైన మాజీ సైనికుల విషయంలో అవసరం అనుకుంటే ప్రత్యేకమైన జి ఓ ను విడుదల చేయాలి.ఈ రాష్ట్రంలో షుమారు ఒక లక్షా పది వేలకు పై బడి ఉన్న మాజీ సైనికులు, కుటుంబ సభ్యుల తో కలుపుకుంటే షుమారు ఆరు లక్షల మంది ఉంటారు కాబట్టి, ప్రభుత్వాలు మాజీ సైనికుల సంక్షేమం పట్ల అశ్రద్ధ వహించటం సరైన పద్ధతి కాదని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర నొక్కి వక్కాణించారు.అంతిమంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం తో మమేకమై పని చేయుటకు మరియు ఎప్పుడూ అవసరం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ కార్యక్రమాలలో పాల్గొనుటకు సిద్ధంగా ఉంటామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అధ్యక్షులు తాండ్ర తో పాటు కమిటీ సభ్యులు తెలియ జేశారు.కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ (అడ్వకేట్), గౌరవాధ్యక్షులు అన్నే రామారావు, స్టేట్ కమిటీ ట్రెజరర్ కె ఉమామహేశ్వర రావు, గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు, బాపట్ల అసోసియేషన్ సెక్రెటరీ షేక్ మొయినుద్దీన్, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు,తాడివాక రుక్మదరరావు మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News