నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి తిరుమలలోని ఆర్బిసి సెంటర్ లో నివసిస్తున్న వారికి బాలాజీ నగర్ లో నివాసం కల్పించాలని టిటిడి ఈఓ ఏకే సింఘాల్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. టిటిడి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ తో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఆయనతో ఎమ్మెల్యే చర్చించారు. తిరుమలలోని ఆర్బిసి సెంటర్ లో నివసిస్తున్న 84 మందిని తిరుపతికి తరించాలని చేస్తున్న ప్రయత్నాన్ని మానుకుని బాలాజీనగర్ లో నివాసం కల్పించాలని ఈఓ ను ఎమ్మెల్యే కోరారు. 1973లో టిటిడికి సహకరించిన ఆర్బిసి సెంటర్ నిర్వాసితులకు తిరుమలలోనే నివాసం కల్పించడం సముచితమని ఆయన అన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మెగాస్టార్ చిరంజీవి బాలాజీనగర్ వాసుల ఇళ్లకు స్లాబ్ వేయిస్తామని ఇచ్చిన హామీని గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇచ్చారని ఆ హామీని త్వరగా నెరవేర్చాలని ఆయన ఈఓ ను కోరారు. అలాగే శ్రీ వెంకటేశ్వర నాట్యకలపరిషత్ రెన్యువల్ చేయడంతో పాటు ఏటా నాటకాల ప్రదర్శనకి కేటాయించే మొత్తాన్ని విడుదల చేయాలని ఆయన ఈఓ ను కోరారు. శ్రీ వకుళమాత అన్నదాన ట్రస్టు లో పనిచేస్తున్న కార్మికులకు టైమ్ స్కేల్, లడ్డు కార్డు, శ్రీవారి దర్శనం కల్పించాలని ఈఓ ను ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను సానుకూలంగా పరికరిస్తామని ఈఓ అన్నారు.





