*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘సైబర్ జాగృక్త దివస్’ పేరుతో ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో గురువారం నిర్వహించారు.*విద్యార్థులు, యువత, ప్రజల్లో చైతన్యం*( కోరుట్ల సిఐ సురేష్ బాబు )సైబర్ నేరాల పెరుగుదల నేపథ్యంలో విద్యార్థులు, యువత, గృహిణులు, ఉద్యోగులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పోలీసులు ప్రత్యక్షంగా కలుసుకుని సూచనలు చేశారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, ఆన్లైన్ లావాదేవీలలో భద్రతా చర్యలు, ఫేక్ లింక్‌లు, ఫోన్ కాల్స్, మోసపూరిత యాప్స్ నుండి రక్షించుకునే పద్ధతులపై కోరుట్ల సిఐ సురేష్ బాబు వివరించారు.*త్వరగా డబ్బు సంపాదించవచ్చు’ అన్న ఆశతో మోసాలు*అనంతరం ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ, ‘ప్రస్తుతం వ్యాపార పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్, IPO స్కామ్‌ల పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మోసాలకు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు బలవుతున్నారు’ అని తెలిపారు. నకిలీ పెట్టుబడి యాప్స్, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు లోనవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.*సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త అవసరం*వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను వాడేటప్పుడు పిల్లలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు అధికారులు సూచించారు. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం వంటి చర్యలతో మోసగాళ్లకు అవకాశం కలుగుతుందని తెలిపారు.*ఉపాధ్యాయులూ చైతన్యం కల్పించాలి*విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు కూడా సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు. ‘మన సమాజంలో సైబర్ అవగాహన పెంపొందితేనే ఈ నేరాలపై కట్టడి సాధ్యం అవుతుంది’ అని తెలిపారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పోతని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.________





