నేటి సాక్షి మహబూబాబా ద్ నర్సింహులపేట (భూక్యా రవి నాయక్) నవంబర్ 7 నరసింహులపేట:మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో ఇసుక దందా రోజురోజుకూ పెరుగుతోంది. కౌసల్యాదేవిపల్లి గ్రామ శివారులోని ఆకేరు వాగు నుండి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారు.పర్మిషన్లు లేకుండా, లైసెన్సు లేని డ్రైవర్లు ట్రాక్టర్లతో ఎటు పడితే అటు దూసుకుపోతుండడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తమ పంట పొలాలకు నీరు అందించేందుకు వేసిన పైపు లైన్లు ట్రాక్టర్లు తొక్కేయడంతో పగిలిపోతున్నాయని ఆకేరు పరివాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.”ఇందిరమ్మ గృహాల పేరిట ఇసుక దోపిడి జరుగుతోంది. మాకు పంటలు దెబ్బతింటున్నాయి, పైపు లైన్లు పగిలిపోతున్నాయి. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





