నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి పార్లమెంట్ పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి లేఖకు కేంద్ర విద్యా శాఖ నుండి సానుకూల స్పందన లభించింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పంపిన లేఖలో ఎంపీ ప్రతిపాదనను గుర్తిస్తూ, నవోదయ విద్యాలయ సమితితో చర్చించి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం, ఒక జిల్లాలో ఇప్పటికే నవోదయ విద్యాలయ ఉన్నచోట కొత్తగా స్థాపించడం సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. అయితే 1986-87లోనే తిరుపతి పార్లమెంటు పరిదిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నవోదయ విద్యాలయ స్థాపించారని పేర్కొన్నారు. ఇటీవల తిరుపతి జిల్లా ప్రత్యేకంగా ఏర్పడిన నేపథ్యంలో తాజా గణాంకాలను పరిశీలించి తిరుపతి జిల్లాలో కొత్త నవోదయ విద్యాలయ స్థాపనకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు. కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటు సమయంలో తిరుపతి జిల్లాని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి కేంద్ర విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, తిరుపతి జిల్లాలో నవోదయ విద్యాలయ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నవోదయ విద్యాలయ స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.





