నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 8) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెరుకపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. గత రెండు రోజులలో 36 గొర్రెలు, శనివారం మరో 6 మరణించడంతో మొత్తం 42 గొర్రెలు చనిపోవడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ మండల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత పెంపకదారులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ ద్వారా పెంపకదారులతో మాట్లాడి, విషాహారం తిని గొర్రెలు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు. పెంపకం దారులు అధైర్య పడవద్దు అని అండగా ఉంటామని తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని గ్రామానికి వచ్చి బాధితులను కలిసి పరామర్శిస్తానని చెప్పారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిహారం అందించడానికి తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.





