నేటి సాక్షి మహబూబాబా ద్ నరసింహుల పేట (భూక్యా రవి నాయక్) నవంబర్9మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే — విద్యార్థిని ఏదో మనస్తాపంతో కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన ఇతర విద్యార్థినులు మరియు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి, బాలికను హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి ( యం జి యం) రిఫర్ చేశారు.ప్రస్తుతం బాలిక చావుబ్రతుకుల మధ్య చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల వార్డెన్ మరియు సిబ్బంది ఈ విషయాన్ని ప్రారంభంలో గోప్యంగా ఉంచినట్లు సమాచారం.ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. అయితే మానసిక ఒత్తిడి, హోస్టల్‌లో జరిగే వేధింపులు, లేదా విద్యాపరమైన ఒత్తిడి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.





