Tuesday, March 17, 2026

వైద్య వృత్తిలోకి తొలి అడుగు…

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)అపోలో మెడికల్‌ కాలేజీలో ఘనంగా వైట్‌ కోట్‌ వేడుక చిత్తూరు, నవంబర్‌ 12ః వైద్య వృత్తి పట్ల గౌరవం, సేవాభావం, నిబద్ధతతో ముందుకు సాగాలనే సంకల్పంతో ది అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (ఏఐఎంఎస్‌ఆర్‌), చిత్తూరులో 2025 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థుల వైట్ కోట్ వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు. వైద్య విద్యార్థుల జీవితంలో వైద్య వృత్తిలోకి తొలి అడుగుగా భావించబడే ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.ఈ సందర్భంగా ది అపోలో యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ హెచ్‌. వినోద్‌ భట్‌ ప్రధాన అతిథిగా, సిఎంసి వేలూరు ప్రముఖ వైద్య నిపుణురాలు డా. మార్గరెట్‌ శాంతి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డాక్టర్‌ అల్ఫ్రెడ్‌ జె. అగస్టిన్‌, అసోసియేట్‌ డీన్లు డాక్టర్‌ రమ్యా రామకృష్ణన్‌, డాక్టర్‌ ఉషా అదిగా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు.డా. ఉషా అదిగా స్వాగత ప్రసంగంలో మాట్లాడుతూ వైట్ కోట్ అనేది కేవలం వస్త్రం కాదు, వైద్య వృత్తి విలువల ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం విశిష్ట అతిథి డా. మార్గరెట్‌ శాంతి మాట్లాడుతూ “మనసులో దయ, చేతుల్లో నైపుణ్యం కలిగినవారే నిజమైన వైద్యులు. రోగి నమ్మకాన్ని కాపాడటం వైద్య విద్యార్థుల ప్రధాన కర్తవ్యం” అని అన్నారు.వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ హెచ్‌. వినోద్‌ భట్‌ మాట్లాడుతూ, వైట్‌ కోట్‌ వేడుక విద్యార్థి జీవితంలో పవిత్రమైన మలుపు అని అన్నారు. ఇది కేవలం జ్ఞానానికి ప్రతీక మాత్రమే కాకుండా, బాధ్యతకు కూడా సూచిక అని ఆయన పేర్కొన్నారు. అపోలో గ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అగ్రగామిగా నిలిచిందని, 75 ఆసుపత్రులు, 12,000 పడకలు, 6,000కు పైగా ఫార్మసీలతో అపోలో గ్రూప్‌ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని వివరించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ సంస్థలో మీరు నేర్చుకునే ప్రతి పాఠం, ప్రతి అనుభవం మీ వైద్య జీవనానికి పునాది అవుతుంది. ఇక్కడి శిక్షణ పూర్తిచేసిన ప్రతి వైద్యుడు సేవాభావం, నైతికత, కరుణతో నిండిన వైద్యుడిగా ఆదర్శంగా నిలవాలి,” అని ఆయన కోరారు. తరువాత విశిష్ట అతిథులు, విభాగాధిపతులు విద్యార్థులకు వైట్ కోట్లను అందజేశారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. బి.జి. రంగనాథ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు హిపోక్రాటిక్‌ ప్రమాణం చేశారు. వైద్య సేవ పట్ల కట్టుబాటు, మానవతా విలువల పట్ల నిబద్ధతతో ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం అనాటమీ డిసెక్షన్‌ హాల్‌లో డా. టెరెసా రాణి మార్గదర్శకత్వంలో విద్యార్థులు క్యాడావరిక్‌ ఓత్‌ చేశారు. “శరీర దాతల వల్లే మానవ శరీర నిర్మాణం లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఆ దాతల పట్ల గౌరవం చూపడం ప్రతి విద్యార్థి మొదటి బాధ్యత” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విబాగాధిపతులు డా. అశోఖ్‌ కుమార్‌రెడ్డి, డా. రమ్యా ఆర్‌, డా. సవిత సెల్వం, డా. శ్రావణ దీప్తి, సుప్రియ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News