నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి నేర స్థలంలో సాక్ష్యాలను సేకరించడానికి క్లూస్ టీమ్ ఎంతో ప్రాధాన్యత కలిగినదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు మారుతి ఎర్టిగా వాహనాలు, వాటిలో ఉన్న సాంకేతిక పరికరాలను ఎస్పీ బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో స్వయంగా పరిశీలించి, అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ మాట్లాడుతూ నేరస్థలంలోని భౌతిక సాక్ష్యాల సేకరణ ఆధారంగా ముద్దాయిలను గుర్తించడంలో, వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడంలో సాంకేతిక బృందం పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ జిల్లాకు కేటాయించిన ఈ మూడు మారుతి ఎర్టిగా వాహనాలను, వాటిలో ఉన్న పరికరాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ వాహనాల ఆధారంగా సాంకేతిక బృందం వేగంగా నేర స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ వాహనాల్లో రక్తపు నమూనాలను సేకరించడానికి, వేలు ముద్రలను తీయడానికి, నేర స్థలాన్ని భద్రపరచడానికి, సేకరించిన సాక్ష్యాలను పరిరక్షించడానికి, ఫోటోలు తీయడానికి, డ్రాయింగ్ వేయడానికి ఉపయోగపడే పరికరాలతో పాటు ఇతర అనేక రకాల పరికరాలున్నాయన్నారు. ఇవి జిల్లాకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఎస్బీ ఇన్‌స్పెక్టర్ జి.నారాయణ, అడ్మిన్ ఆర్‌ఐ షేక్.మౌలుద్దీన్, క్లూస్ టీమ్ ఎస్‌ఐ వెంకటేశ్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





