నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )రైల్వే స్టేషన్ సమీపంలో గంజా విక్రయిస్తున్న ఇద్దరు యువకులను కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ సీఐ ఎం.శ్రీనివాస్, ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద ఆకస్మికంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో, గంజా విక్రయిస్తున్న ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజా, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన సమయంలో మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడినవారు షేక్ అమన్ అలియాస్ ఫైజు రజా (21) కార్ మెకానిక్, ఆరఫత్పూర్, కోరుట్లకు చెందినవాడు, మరియు ఎం.డి. ముఖీం అలియాస్ ముక్తదర్ (21) డిగ్రీ విద్యార్థి, ఆరఫత్పూర్, కోరుట్లకు చెందినవాడు. వీరిద్దరూ గంజా విక్రయం చేస్తున్న సమయంలో పట్టుబడ్డారు. గంజా ఎక్కడి నుండి తెచ్చారు, ఎవరికీ సరఫరా చేయాలనుకున్నారు అన్న అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో సహచరుడు మాత్రం దాడీ సమయంలో పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.*గంజా వ్యాపారంపై కఠిన చర్యలు* ( కోరుట్ల సీఐ హెచ్చరిక )ఈ సందర్భంగా కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు మాట్లాడుతూ.. గంజా తాగే, అమ్మే, రవాణా చేసే వారిపై ఎలాంటి కనికరం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి నేరాల్లో పాల్పడిన వారిపై భవిష్యత్తులో పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మత్తు పదార్థాల వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దళాలు కృషి చేస్తున్నాయని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.__




