నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్) నవంబర్ 13మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక రవాణా అనుమతుల పేరుతో పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలు వెలుగుచూస్తున్నాయి. స్థానిక ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు చెబుతున్న వివరాల ప్రకారం — అధికార అనుమతులు ఉన్నప్పటికీ, ఒక కూపన్ కోసం రూ.2000 వసూలు చేస్తున్నారని, అదనంగా అదే పత్రంపై స్టాంప్ ముద్ర వేయడానికి రూ.500 ఇవ్వకపోతే ఫైల్‌ను ముందుకు కదపడం లేదని ఆరోపిస్తున్నారు.”అనుమతులు ఉన్నవారినే ఇంత వసూలు చేస్తే, అక్రమంగా ఇసుక తరలించేవారిని ఊహించుకోండి” – స్థానికుల ఆవేదనఇసుక రవాణా కోసం సరైన మార్గంలో అనుమతి తీసుకునే ప్రయత్నం చేసినవారికి ఇలా చెల్లని వసూళ్లు జరగడం వల్ల, చాలా మంది అధికార మార్గం కాకుండా అక్రమ మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు చెబుతున్నారు.ఇదే సమయంలో, తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే వీడియో, ఫోటో ఆధారాలు కూడా కొంతమంది ప్రజలు సేకరించినట్టు సమాచారం.ప్రజల వేదనకు స్పందన లేకపోవడంపై ఆగ్రహంస్థానిక ప్రజలు మరియు ట్రాక్టర్ యజమానులు పలుమార్లు ఈ అవకతవకల విషయాన్ని ఆర్‌డీవో, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.”ప్రతి రోజూ తాసిల్దార్ కార్యాలయంలో ఈ లావాదేవీలు బహిరంగంగానే జరుగుతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది అవినీతి కాదా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఉన్నతాధికారుల తక్షణ విచారణ, చర్యలు కోరుతూ ప్రజల డిమాండ్ఇసుక రవాణా అనుమతుల పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న ఈ అధికార దోపిడీపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇసుక రవాణా విధానం పారదర్శకంగా ఉండేలా ఆన్లైన్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని, ఎవరైనా ఉద్యోగి లేదా మధ్యవర్తి డబ్బులు తీసుకుంటే వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





