నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* అభం శుభం తెలియని వయస్సులో పెళ్ళి పేరిట మూడుముళ్ళతో బాల్య దశను భర్త పిల్లలు అంటూ బాలికలపై కుటుంబ భారాన్ని మోపుతున్న దయనీయ దుస్థితిపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని చర్లపల్లి గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగన్, చైల్డ్ లైన్ 1098 అధికారి కేసు వర్కర్ రజిత ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ అవరణలో ప్రజలకు, గ్రామ పెద్దలకు, పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల ద్వారా జరిగే అనర్థాలు, చట్ట పరమైన చర్యలు గూర్చి వివరిస్తూ… బాల్య వివాహ చట్టం- 2006, పోక్సో చట్టం -2012, మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు వినియోగం వంటి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సం.లోపు అమ్మాయికి 21 సం.లోపు అబ్బాయికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఇందుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారన్నారు. అదేవిధంగా బాల్యవివాహాల ద్వారా పుట్టబోయో పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని, ప్రభుత్వం నుండి ఇచ్చే ప్రోత్సాహాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు వర్తించవని అన్నారు. వీటి నిర్మూలనకు గ్రామాల్లో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి వారి సమస్యలను గురించి చర్చించి పరిష్కారంకై చొరవ చూపాలని కోరారు. బాలబాలికలు మత్తు పదార్థాలు సేవించడం, అధిక మొబైల్ ఫోన్స్ వినియోగం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.18 సంవత్సరాల లోపు బాలబాలికల రక్షణ, సంరక్షణకు అవసరమైన 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం చైల్డ్ హెల్ప్ లైన్1098, పోలీస్ 100 డయల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్య వివాహాలు లేని భారతదేశ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సీడీపీఓ వాణిశ్రీ, సహాయ ఎన్జీవో లహరి, పంచాయితీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, అంగన్వాడి టీచర్ కడారి పద్మ, ఏఎన్ఎం సునీత, వివో సంఘ సభ్యులు జెల్ల మల్లీశ్వరి, సునీత, ఆశావర్కర్లు లత, రజిత, మహిళలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.





