నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్) నవంబర్ 15మహబూబాబాద్ పట్టణంలో విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఒక ఘోర ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. విద్యా దేవాలయంగా భావించే పాఠశాలల్లో విద్యార్థులకు మానవతా విలువలు, నీతి బోధన చెయ్యాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతలను తుంగలో తొక్కి, చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.*పాఠశాలలోనే విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన*మహబూబాబాద్ పట్టణంలోని కంకరబోర్డులో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇనుగుర్తి రవి అనే ఉపాధ్యాయుడు, గత పది రోజులుగా పలు తరగతులలో చదువుతున్న విద్యార్థినీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది.పాఠశాల సమయాల్లో, తరగతి గదుల్లో, కొన్నిసార్లు ఇతర ఉపాధ్యాయులు లేని సమయంలో విద్యార్థినీలను ఒంటరిగా పిలిచి అసంగత ప్రవర్తన ప్రదర్శించినట్లు ఆరోపణలు బయటపడ్డాయి.*భయంతో నోరు మెదపని విద్యార్థినులు*సామాజిక ఒత్తిడి, భయం, అవమానభావం కారణంగా బాధిత బాలికలు ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేక మౌనంగా ఉన్నారు. ఒక బాలిక మాత్రం తట్టుకోలేక, ఈ రోజు తన తల్లికి గోప్యంగా వివరాలను చెప్పింది. ఆమె వివరాలు విన్న తల్లి తీవ్ర ఆవేదనకు గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు సందర్భంగా బాలిక తెలిపిన వివరాలు మరికొన్ని విద్యార్థినులు కూడా ఇలాంటి వేధింపులకు గురై ఉండొచ్చనే అనుమానాలకు దారితీశాయి.*పోలీసుల విచారణ – పోక్సో కేసు నమోదు*బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి గారు, ఉపాధ్యాయుడైన ఇనుగుర్తి రవి పై పోక్సో (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రొం సెక్సువల్ ఆఫన్సెస్ యాక్ట్) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం—ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.పాఠశాల సిబ్బంది, ఇతర విద్యార్థుల వాంగ్మూలాలు సేకరించనున్నారు.మరికొన్ని బాలికలు కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యారా అన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఆధారాల ఆధారంగా మరింత తీవ్రమైన సెక్షన్లు కూడా జతచేయబడే అవకాశముంది.*పాఠశాలలో ఆందోళన – తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహం*ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, పర్యవేక్షణ వ్యవస్థలు మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.*సామాజిక వర్గాల స్పందన*ఈ ఘటనపై మహిళా సంఘాలు, బాలల సంక్షేమ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు నిలువరించే విధంగా వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాలి అని డిమాండ్ చేశాయి.





