Wednesday, March 25, 2026

*పత్తి కొనుగోళ్లపై గందరగోళం** సీసీఐ నిబంధనలతో నిలిచిన కొనుగోళ్లు * కొత్తపేటలో కాటన్ మిల్ బంద్ * ఆందోళనలో పత్తి రైతులు*

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమల్లోకి తెచ్చిన నూతన నిబంధనల వల్ల పత్తి రైతులతో పాటు మిల్లర్ల లో గందరగోళం నెలకొంది. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాటన్ జిన్నింగ్ మిల్లులు సోమవారం నుండి బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలు బంద్ పాటించడంతో సీసీఐ అధికారులు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు. మండలంలోని కొత్తపేట శాతవాహన కాటన్ జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లులో ముందస్తు కొనుగోళ్ళు నిలిపివేత సమాచారంతో రైతులు పత్తిని తీసుకురాక పోవడంతో మిల్ బోసిపోయింది. ఈ సందర్భంగా మిల్ నిర్వాహకుడు కొమ్ము రాంబాబు మాట్లాడుతూ… సీసీఐ నూతన నిబంధనలు మిల్ ల నిర్వహణకు శాపంగా మారిందని, కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకొని స్లాట్ బుకింగ్ తో అమ్మకం జరపడం ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని, మరి ముఖ్యంగా జిన్నింగ్ మిల్లులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలు గా విభజించి దశల వారీగా కొనుగోళ్లను జరిపేలా సీసీఐ కేటాయించడం మిల్లర్లకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే పంట నష్టపోయి వాపోతున్నారని తేమ శాతం అంటూ సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనలతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా పరిస్థితి విషమించక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు స్పందించి సీసీఐ నూతన నిబంధనలు సవరించి కొనుగోళ్లను వెంటనే పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News