నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 21, నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ పరిధిలో గురువారం రాత్రి, లోకల్ పోలీసులు, ప్రత్యేక దళాలు ఆపరేషన్ చపుత్ర కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో, హోటల్, షాపుల ముందల, పబ్లిక్ ప్లేసుల వద్ద అనుమానాస్పదంగా గుమికూడి యువతీ–మహిళలకు అసౌకర్యం కలిగించేలా తిరుగుతున్న వారు నారాయణపేట నుండి 26, మక్తల్-18,మరికల్ -07, కోస్గి – 5 మంది మొత్తం 56 మంది యువకులను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారందరికి మహిళల పట్ల గౌరవం, ఈవ్ టీజింగ్ – హరాస్మెంట్‌పై చట్టపరమైన శిక్షలు, బాధ్యతాయుత ప్రవర్తన, యువత భవిష్యత్తుపై ప్రభావం వంటి అంశాలపై యువతకు వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో చైతన్యం కల్పిస్తూ, ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నేటి యువకులే రాబోయే భావితరాలకు బాటసారులని అలాంటి యువత నేడు అర్ధరాత్రి వరకు కాలనీలలో విచ్చలవిడిగా తిరుగుతూ దారిన పోయే వారిపై అనుచిత వాక్యాలు చేస్తూ తమ విలువైన బంగారు సమయాన్ని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తమకున్న సమయాన్ని వృధా చేసుకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని కావున తమకున్న ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు. జిల్లా పరిధిలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.అలాగే జిల్లా పరిధిలో మహిళల భద్రత మా ప్రథమ బాధ్యత… ఎవరి నుంచైనా వేధింపులు జరిగితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రజలు యువకులు చట్టాన్ని గౌరవించి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై గమనిస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.ఆపరేషన్ చపుత్ర లో పట్టుబడ్డ 56 మంది యువతకు ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించి కౌన్సిలింగ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని అన్నారు.



