నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి పార్లమెంటు పరిధి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం తూకివాకం, పన్నీరు కాల్వ, కొత్తకాల్వ, కొట్ర మంగళం, వి.ఆర్. కండ్రిగ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు భద్రతా సమస్యలను వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రేణిగుంట మాజీ జడ్పీటిసి తిరుమల రెడ్డి, తూకివాకం ఎంపిటిసి ఆనందరావు, వార్డు మెంబర్ శేఖర్ రెడ్డి, పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.చిత్తూరు, నాయుడుపేట జాతీయ రహదారి (ఎన్. హెచ్–16)పై తూకివాకం సమీపంలోని టయోటా షోరూమ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతిగా పెరిగిన వాహన రద్దీ కారణంగా సాధారణ ప్రజలు హైవే దాటడమే ఒక సవాలుగా మారిందన్నారు. సమీప గ్రామాల ప్రజలు రోడ్డు దాటే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి విస్తరణతో వాహనాల వేగం పెరిగి ప్రమాదాల సంఖ్య కూడా పెరిగాయని ఎంపీకి తెలిపారు. వెహికల్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాయకులు తెలిపారు.ఈ సమస్యపై ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ ఇప్పటికే కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ప్రదేశంలో వెహికల్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయి సాంకేతిక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించాల్సిందిగా గడ్కరీ మంత్రి ఆదేశించినట్లు ఎంపీ వెల్లడించారు. దీనికి సంబంధించి తమ కార్యాలయం నుంచి నిరంతరం ఫాలోఅప్ చేస్తామని హామీ ఇచ్చారు.





