నేటి సాక్షి పాలేరు , నవంబర్ 24 :భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల జయప్రదం కోరుతూబాసరలో ప్రారంభమైన ప్రచార బస్సు జాతా బృందం సోమవారం ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిపిఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో బస్సు జాత బృందానికి పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. డిసెంబర్ 26న ఖమ్మంలో జరగబోయే 100 సంవత్సరాల ఉత్సవాలను విజయవంతం చేయడం ద్వారా కమ్యూనిస్టులు లేరని ప్రచారం చేసేవారికి కనువిప్పు కలిగించాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి లౌకికవాదులు కమ్యూనిస్టు పార్టీల నాయకులు కలిసి రావాలని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఆదివాసులలో జైల్లో పెడుతున్నారని, మావోయిస్టులను హతమారుస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం సభ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోనుందని అన్నారు. పోరాటాలతోనే పాలకుల అరాచకాలను తిప్పి కొట్టడం సాధ్యమవుతుందని అన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలోనే కాక అనేక ప్రజా ఉద్యమాలు కార్మిక కర్షక ప్రజా పోరాటాలు సమరశీల ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు నిరుద్యోగులు కార్మికులు విద్యార్థుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకు పోరాడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లా అని అన్నారు. ఈ కార్యక్రమంలో బస్సు జాతా బృందం నాయకులు ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి. కేతరాజు ఉప్పలయ్య, నరేంద్ర ప్రసాద్, ఆర్ ఎల్ రవి, పార్టీ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా నాయకులు కొండపర్తి గోవిందరావు, ఏనుగు వెంకటేశ్వరరావు, దొండపాటి రమేష్, చెరుకుపల్లి భాస్కర్, పుచ్చకాయల కమలాకర్, గుండెపంగు మల్లేష్, ఉపేందర్ కూసుమంచి మండల కార్యదర్శి భూక్య నరసింహ, సహకారదర్శి జిల్లా లింగయ్య, మండల నాయకులు పాండురంగ చారి, భూక్య ప్రశాంత్, భూక్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





