నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 26, ప్రియదర్శిని జూరాల, సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్ల భూ నిర్వాసితులతో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి లు ముఖాముఖి అయ్యారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ భూమి నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. రైతులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకురాగా ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని వారికి భరోసానిచ్చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్లను అలాగే జూరాల బ్యాక్ వాటర్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.





