నేటి సాక్షి – రాయికల్*రాయికల్ అటవీ రేంజ్ పరిధిలోని బోర్నపెల్లి అడవిలో గత మూడు నెలలుగా విలువైన టేకు చెట్లు నరికివేతకు గురవుతున్నాయన్న ఆరోపణలు నిజమైనట్టు ధృవీకరించింది అటవీ శాఖ. జన్నారం డాగ్‌స్క్వాడ్ సహకారంతో నిందితులను గుర్తించి రూ.1,82,494 విలువైన టేకు కలపను పట్టివేసినట్టు రాయికల్ రేంజ్ అధికారి భూమేష్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.*డాగ్‌స్క్వాడ్‌తో స్మగ్లర్ల ఇంటి వద్దకే!*బోర్నపల్లి ఫారెస్ట్ ఏరియాలో టేకు చెట్లు నరికివేతకు గురవుతున్నాయని గుర్తించిన రాయికల్ రేంజ్ సిబ్బంది గత మూడు నెలలుగా రౌండ్లు వేసినా నిందితులు దొరక్కపోవడంతో జిల్లా అటవీ అధికారి (DFO) దృష్టికి తీసుకెళ్లారు. DFO ఆదేశాల మేరకు జన్నారం డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. చెట్లు నరికిన స్థలానికి చేరుకున్న డాగ్‌స్క్వాడ్ వాసన పసిగట్టి నేరుగా బోర్నపెల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మోడి ఆంజనేయులు (45), జంగిలి గంగారాం (42) ఇండ్ల వద్దకు వెళ్లి నిలిచిపోయింది. వెంటనే సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా… వీరే ఆరు టేకు చెట్లు నరికినట్టు ఒప్పుకున్నారు. వీరిపై అటవీ చట్టం సెక్షన్ 20, 21/సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు రేంజర్ భూమేష్ తెలిపారు.*అటవీ రక్షణలో కొత్త పద్ధతులు*’స్మగ్లర్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా… డాగ్‌స్క్వాడ్ ముందు తప్పించుకోలేరు..ఇకపై అటవీ రక్షణలో ఈ కొత్త పద్ధతులను విస్తృతంగా అవలంబిస్తామ’ని రేంజర్ భూమేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అటవీ రక్షణలో సహకరించాలని, స్మగ్లర్ల గురించి సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ రేంజర్ పద్మ, సెక్షన్ అధికారులు మల్లన్న, విజయ్‌కుమార్, బీట్ అధికారి రత్నాకర్, వాచర్ బాపురావు తదితరులు పాల్గొన్నారు.____





