నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల తొలి విడత నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కోరుట్ల మండలంలోని ఐలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను మెట్ పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్‌తో కలిసి పరిశీలించారు. నామినేషన్ సెంటర్ల వద్ద 100 మీటర్ల పరిధిలో జనసమ్మర్థం, ఊరేగింపులు, ప్రకటనలు నిషేధం చేస్తూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఏ చిన్న అవాంఛనీయ పరిస్థితికి అవకాశం ఇవ్వకుండా పోలీసులు స్థిరపడ్డారని ఎస్పీ తెలిపారు.*ఎన్నికల నియమావళి తప్పనిసరి*నామినేషన్ల సమయంలో అభ్యర్థులు, మద్దతుదారులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ సూచించారు. అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి. కుల–మత–వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. లౌడ్స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్‌ను వాహనాలపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.*అనుమతికి నో.!*నామినేషన్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి అనుచరులు 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే రావాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి కేవలం అభ్యర్థి, మరో ఇద్దరికే ప్రవేశం ఉంటుందని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.ఈ బందోబస్తు ను కోరుట్ల ఎస్ఐ చిరంజీవి,రెండవ ఎస్ఐ రామచంద్రంలు పర్యవేక్షించారు.____





