నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల రూరల్)బాపట్ల సూర్యలంక రోడ్డులోని ప్రొడిజి విద్యాలయంలో గురువారం ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది చిన్నారులకు వైద్య బృందం కంటి పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపల్ బ్రజేష్ కానూన్ గో మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో చిన్నారులు చాలా చిన్న వయసులోనే కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన సమయంలో మెరుగైన చికిత్స అందించడం ద్వారా వాటిని పూర్తిగా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. విద్యార్థుల కంటి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ డైరెక్టర్లు శ్రీనివాస రావు, పార్థసారథి, ఉదయ చంద్ర రావు, వరలక్ష్మి పాల్గొన్నారు. అలాగే పరీక్షలు నిర్వహించిన ఎల్వీ ప్రసాద్ వైద్య సిబ్బంది ఎన్. పిచ్చి రెడ్డి, నవీన్ రాజ్, చందు, యమున, సరళ, పవన్ తదితరులు పాల్గొన్నారు.





