నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) చంద్రగిరితిరుపతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. నీరజ.ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ (ఆర్ వై ఎస్ ఎస్,) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. నీరజ గురువారం తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నారవారిపల్లె క్లస్టర్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా రైసా అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం’’ ద్వారా అమలు జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనా క్షేత్రాలను పరిశీలించారు.నారవారిపల్లె క్లస్టర్‌లోని పలు గ్రామాల్లో సాగు జరుగుతున్న ఏటీఎం, ఏ-గ్రేడ్, పీఎండీఎస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ నమూనా పంటలను పరిశీలిస్తూ, రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తున్న పంటల పెట్టుబడి వ్యయం, దిగుబడి, ఆదాయం వివరాలు, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతును భాగస్వామ్యం చేయాలని, ఈ విధానం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.ప్రకృతి వ్యవసాయం వలన వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి పెరగడంతో పాటు, రైతులకు అనేక లాభాలు చేకూరుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సాగు వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుందని, నేల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీపీఎం షణ్ముఖం, అదనపు డీపీఎం ప్రతాప్ రెడ్డి, జిల్లా యాంకర్ రవిచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





