నేటి సాక్షి, వేములవాడ:వేములవాడ సాయినగర్‌లోని స్కై స్కూల్ లో శనివారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌కు సందడిగా సాగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోజువారీగా అందించే వివిధ రకాల ఆరోగ్యకర ఆహారాలను ఈ వేడుకలో ప్రదర్శించగా, పిల్లలు కూడా పెద్దలతో కలిసి వంటకాలను తయారుచేసి తీసుకువచ్చారు. సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యం, బయట లభించే జంక్‌ఫుడ్ వల్ల కలిగే నష్టాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్కూల్ కరస్పాండెంట్ మహేష్ తెలిపారు. హోమ్మేడ్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అలాగే పిల్లలకు ఆకుకూరలు, స్వీట్లు, పెరుగు, పీచుపదార్థాలు, బెల్లంతో తయారు చేసిన వంటకాలు అందించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రీ-ప్రైమరీ పిల్లలకు సహజంగా లభించే పండ్ల ప్రయోజనాలు కూడా ఉపాధ్యాయులు వివరించారు. వంటకాలను ఎలా తయారు చేశారో, వాటిని తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో విద్యార్థులే స్వయంగా వివరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థుల్లో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను పెంపొందించే ప్రయత్నంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ జమున, ఉపాధ్యాయులు స్రవంతి, శైలజ, అర్చన, స్రవంతి, శ్రీ హేమకళ, దివ్య, మమత, చంద్రకళ, అంజలి, సూపర్వైజర్ రాము పాల్గొన్నారు.




