నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వరుస ప్రమాదాలతో ప్రజలు బస్సు ప్రయాణించడానికే భయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. అక్టోబర్ 24న తెల్లవారుజామున ఏపీలో కర్నూలు సమీపంలో చిన్నటేకూర వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమ్యారు. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఇలా వరుస ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజులకు ముందు తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోనూ రెండు బస్సులు ఢీకొని అక్కడికక్కడే సుమారు 15 మంది దాకా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పొద్దుటూరు నుండి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు మదనపల్లి దాటగానే కర్ణాటక సరిహద్దులో ప్రమాదానికి గురయ్యింది. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని శ్రీనివాసపురం తాలుకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదంలో మరణించిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా పోలీసులు గుర్తించారు.ఏపీ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఘటన..ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జాతీయ రహదారి కావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు..~~~~~~~~~~~~~~~~~~





