నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి ప్రజా వ్యతిరేకతతో కాకుండా, ప్రజా నిర్ణయంతోనే పక్కన నూతన మాస్టర్ ప్లాన్ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. నూతన మాస్టర్ ప్లాన్ విధానంపై మరో నెలరోజుల పాటు గడువు పెంచడంతోపాటు ప్రజలకు అవగాహన సదస్సులు కల్పించాలని పురపాలక సంఘ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి వినతి పత్రంను తన వ్యక్తుల ద్వారా గురువారం అందజేయించారు. పట్టణభివృద్ధి ప్రణాళిక విభాగం ద్వారా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్, నూతన రోడ్ల ఏర్పాటు, రహదారుల విస్తరణ జోన్ల విధానంపై ఆశాస్త్రీయంగా, లోపా భూయిష్టంగా ప్రణాళిక సిద్ధం చేయడం సరైన విధానం కాదని, భవిష్యత్తులో బాపట్ల ప్రాంత ప్రజలకు నిర్మాణ అనుమతులు పై అసౌకర్యం కలగకుండా ప్రణాళిక బద్ధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నం సతీష్ అధికారులకు వివరించారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి నూతన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించిన తర్వాత బాపట్ల ప్రాంతంలో చిన్న,మధ్య తరగతికి చెందిన 2,3,లేదా నాలుగు సెంట్లు ఎన్నో తరాలుగా నివాసం ఉంటూ జీవనం సాగించు వారికి, నూతనంగా నిర్మాణాలు చేపట్టుటకు అనుమతులు లభించే విధంగా లేదన్నారు. ప్రస్తుతం ఉన్న రహదారులకు వినియోగం కాకుండా పక్కనే నూతన రహదారులు ప్రతిపదన చేయడం అనాలోచిత చర్య అని, అవసరానికి మించి ప్రస్తుత రహదారుల విస్తరణ ప్రతిపాదనలు చేయడం సహేతుకంగా లేదన్నారు. పట్టణ అభివృద్ధి ప్రణాళిక జోన్ల ఏర్పాటు తాకరారుగా ఉన్నదని సరైన ప్రతిపదిక కనిపించలేదని వివరించారు. ప్రస్తుతం ప్రకటించిన డ్రాఫ్ట్ ఆమోదం పొందితే ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ప్రజలకు మరింత అవగాహన కల్పించి ప్రజల నిర్ణయం మేరకే నూతన డ్రాఫ్ట్ తయారు చేయాలన్నారు. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ అభ్యంతర సేకరణ గడువు మరో 30 రోజులు పొడిగించి అన్ని వార్డులలో గ్రామ,వార్డు సచివాలయాలలో అవగాహన కల్పించే విధంగా మున్సిపల్ కమిషనర్,పట్టణ ప్రణాళిక అధికారి వారి నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ రఘునాథరెడ్డి ఉన్నతాధికారులతో చర్చించి గడువు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.





