నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ప్రచారం, ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియ పర్యవేక్షణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపులమైన సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జనరల్ అబ్జర్వర్ జి. రమేష్ పాల్గొన్నారు.*ఏకగ్రీవ గ్రామాల్లో ఉపసర్పంచ్ ఎంపిక–ఫారం 10 ప్రకారం ఫలితాల ప్రకటన*కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో ఉపసర్పంచ్ నియామకం కూడా పూర్తిగా నిబంధనల ప్రకారమే జరగాలి అని స్పష్టంచేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పోస్టులకు ఫారం–10 ప్రకారం ఫలితాల ప్రకటన చేయాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామాలకు స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని సూచించారు. నామినేషన్‌లకు సంబంధించిన సమస్త డేటాను టి-పోల్ పోర్టల్‍లో పెండింగ్ లేకుండా అప్‌డేట్ చేయాలని విపులంగా వివరించారు.*పోస్టల్ బ్యాలెట్ సదుపాయం తప్పనిసరి* ( ప్రతి మండలంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు )ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అర్హత ఉన్నవారి దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి తప్పనిసరిగా సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలంలో ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, బ్యాలెట్ పేపర్లు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ముద్రించాలని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థలో ఏ విధమైన ఆలస్యం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశారు.*ఎన్నికల ప్రచారంపై కఠిన నిఘా*( ఎంసీసీ ఉల్లంఘనలకు తక్షణ చర్యలు )ఎన్నికల సమయంలో ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ఉల్లంఘనలు జరుగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క ఓటు కూడా ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతుందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలక మైనవని, అందువల్ల అధికారులు పూర్తిగా అప్రమత్తంగా పని చేయాలని అన్నారు. సోషల్ మీడియా, బహిరంగ ప్రచారం, ముద్రిత మాధ్యమాలపై కూడా ఎంసిఎంసి కమిటీలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.*అక్రమ నగదు, మద్యం, బంగారం తరలింపుపై కట్టుదిట్టమైన తనిఖీలు* : అదనపు డీజీపీ మహేష్ భగవత్లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలించే నగదు, మద్యం, ఆభరణాలు, బహుమతులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పట్టుబడిన వాటిని నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని సూచించారు. పోలింగ్ రోజున ప్రతి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్‌స్టేట్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోలు సీజన్ దృష్ట్యా, రైతుల వద్ద ప్రేక్షకిస్తున్న నగదు పంటకు సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని సీజ్ చేయరాదని స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, నోడల్ అధికారులు బి. నరేష్, మనోజ్ కుమార్, మదన్మోహన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.______





