నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 5,నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు గత మూడు నెలల్లో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 106 మొబైల్ ఫోన్లను శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఎస్పీ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు తిరిగి అందజేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు 16 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ లోగానీ, దగ్గరలోని పోలీస్ స్టేషన్ లోగానీ వెంటనే ఫిర్యాదు చేయాలి అని తెలిపారు. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా వరకు దొంగతనమైన మొబైల్ ఫోన్లు నేర కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదంగా పాత/సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనరాదు అని సూచించారు.తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి అన్నారు.దొంగతనానికి గురైన సెల్ఫోన్లు పట్టుకునే బాధ్యత పోలీసులది అని వాటిని తప్పనిసరిగా పట్టుకోవడం జరుగుతుందని, నేరస్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.జిల్లాలోని ఐటి కోర్ పోలీసులు ఆధునాతన టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్ల ట్రేస్ చేసి మొత్తం 106 ఫోన్లు రికవర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి కృషిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డిఎస్పిలు ఎన్. లింగయ్య, మహేష్, సిఐలు శివశంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఐటి కోర్ ఎస్ఐ సురేష్, ఇతర ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు మొబైల్ స్వీకరించిన బాధితులు పాల్గొన్నారు.





