నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 05 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సిబ్యాల లోని ప్రభుత్వ ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల లో జరుగుతున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సమావేశ మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న పేరెంట్ – టీచర్ సమావేశం (పీటీఎం) కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభివృద్ధి, ప్రవర్తన తదితర అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను విచారించి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధన విధానం, బోధన ప్రభావం, పరీక్షా ఫలితాలపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా పరిరక్షణ చర్యలు విద్యార్థులకి సక్రమంగా చేరేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత అని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య పొందేలా అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. పాఠశాల శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యమివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థులు భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, అందుకే విద్యా హక్కు మాత్రమే కాకుండా, సమగ్రాభివృద్ధి హక్కు కూడా వారికి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల మానసిక, శారీరక వికాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి వారం ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సాంప్రదాయ బద్ధంగా భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో పిల్లలతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తించే తీరు ఎలా ఉందని తరగతులు బాగా జరుగుతున్నాయా లేవా. ఉపాధ్యాయులు సమయానికి తరగతులకు హాజరవుతున్నారా లేదా. తరగతులు జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం చేస్తున్నారా అంటూ పలు ప్రశ్నలను విద్యార్థినీల వద్ద ఆరా తీశారు. పాఠశాలలో క్రీడలు, కళలు, సృజనాత్మక కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించబడుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి, విద్యార్థులు తీసుకునే ఆహారంపై వారి అభిప్రాయాలను స్వయంగా పిల్లలు మరియు తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. మరింత రుచికరంగా విద్యార్థినీలకు అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మన ఇళ్లల్లో బిడ్డలను ఎలా చూసుకుంటామో ఇక్కడ కూడా వాళ్ళు అదే విధంగా చూసుకోవాలని వాళ్లకు ఏ లోటు రాకుండా సంరక్షించాలని దూర ప్రాంతాల నుండి తల్లితండ్రులను వదిలి విద్య కోసం ఇంత దూరమొచ్చి చదువుతున్నారని అలాంటి వాళ్లను బాగా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు హితువు పలికారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





