Saturday, March 21, 2026

కుత్బుల్లాపూర్ కబ్జాలపురమైందా? – జాగృతి జనం బాటలో కవిత ప్రశ్న- చెరువులు, ప్రభుత్వ భూములపై కబ్జాలే – ప్రజా సమస్యలు పట్టించుకోరా? – 60 ఎకరాల పరికి చెరువు 16 ఎకరాలకే, కబ్జాదారుల దౌర్జన్యంపై ఆగ్రహం- బస్సు డిపో, మెడికల్ కాలేజీ హామీలు ఏయ్యా? – స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కవిత విమర్శ- “పేదలకు న్యాయం చేయకపోతే తాట తీస్తాం” ప్రాజా సమస్యలపై కవిత హెచ్చరికకుత్బుల్లాపూర్, డిసెంబర్ 05

( నేటి సాక్షి)జాగృతి జనం బాట పర్యటనలో భాగంగా శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానిక సమస్యలను తెలుసుకుంటూ విరుచుకుపడ్డారు. చెరువులపై జరుగుతున్న కబ్జాలను ఘాటుగా విమర్శించిన ఆమె, “ఈ పరిస్థితి చూస్తుంటే కుత్బుల్లాపూర్ పేరు కబ్జాలాపూర్‌గా పెడితేనే సరిపోతుంది” అని వ్యాఖ్యానించారు.షాపూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కవిత, అక్కడి సిబ్బంది, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాజులరామారం, సూరారం పరిధిలో ఉన్న పరికి, లింగం చెరువుల్లో జరుగుతున్న అక్రమాలను పరిశీలించారు.పరికి చెరువు 60 ఎకరాల విస్తీర్ణం ఉండాలని రికార్డులున్నా, ప్రస్తుతం కేవలం 16 ఎకరాలే మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఎఫ్టీఎల్ రాళ్లను తీసేసి నిర్మాణాలు సాగించడం… కబ్జాదారులకు , రియల్ ఎస్టేట్ మాఫియాకే సాధ్యం. ఇవన్నీ రాజకీయ మేనేజ్‌మెంట్‌తోనే జరుగుతున్నాయి” అని మండిపడ్డారు.కబ్జాల వ్యవహారంలో అన్ని పార్టీల నేతలకూ పాత్ర ఉందని, ఇప్పటికీ కొత్త నిర్మాణాలు ఎఫ్టీఎల్‌కు సమీపంలోనే జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. హైడ్రా కమిషనర్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జగద్గిరిగుట్ట బస్సు డిపో, మంజూరైన మెడికల్ కాలేజీపై ఇంకా పురోగతి లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కవిత ఆగ్రహించారు.“ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఉన్నా… 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా కుత్బుల్లాపూర్‌లో నిర్మించలేకపోవడం ఎవరికి ఉపయోగం?” అని నిలదీశారు. ఒకప్పుడు టీడీపీ, ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే ప్రస్తావన చేస్తూ, “రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియని నాయకులతోనే చెరువులు మింగేశారు” అంటూ విమర్శించారు.చర్చి గాగిల్లాపూర్‌లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన కవిత, ప్రభుత్వాన్ని పనులను వెంటనే పూర్తిచేసి పేదలకు ఇళ్లు అందజేయాలని కోరారు.జాగృతి ప్రజల పక్షాన నిలబడుతుందని, “పేదలను మోసం చేస్తే ఊరుకోం… తాట తీస్తాం” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాగృతి నేతలు ఇస్మాయిల్, రాగిడి వెంకటరామిరెడ్డి, పడాల మనోజ్, శీలం వీరేందర్, సీతారాం, సంధ్యారెడ్డి, నవీన్, ఊర్మిళ, మనీష్, ప్రశాంత్, సర్వీస్ శేఖర్, గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News