Saturday, March 21, 2026

మొదటి విడత పోలింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 072వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్-యు, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత లో భాగంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ముందు రోజు సాయంత్రం 4 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని, ఎన్నికలలో ఉపయోగించే సామాగ్రి, కవర్లు, పేపర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను సరి చూసుకోవాలని, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తి కొరకు పంపిణీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి త్రాగునీరు, అల్పాహారం, భోజనం సమయానికి అందించాలని, జోనల్ అధికారులు తమ రూట్ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. స్టేజ్ 2 ఆర్.ఓ. లకు మరోసారి శిక్షణ ఇవ్వాలని, పి. ఓ., ఓ. పి. ఓ. లకు ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరిగే మండల కేంద్రాలలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పోలింగ్ సిబ్బంది సామాగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకొని రిపోర్ట్ చేసేలా చూడాలని, రూట్ల వారీగా అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని, పూర్తి బందోబస్తు మధ్య ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News