Friday, March 20, 2026

కూటమి ప్రభుత్వ విధివిధానాలపై దేవినేని అవినాష్ విమర్శలు..రాష్ట్రంలో సంక్షేమం లేదు. అభివృద్ధి లేదు.. చేస్తున్న అప్పులు ఏమైపోతున్నాయో.. దేవినేని అవినాష్

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తమ వ్యతిరేకతను ఈ సంతకాల ద్వారా తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లో సంతకాల సేకరణ చేపట్టామని, ఇప్పటికే 96 వేలకు పైగా సంతకాలు సేకరించామని అవినాష్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా 60 వేలకు పైనే సంతకాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ సేకరించిన సంతకాలను నియోజకవర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి, డిసెంబర్ 15వ తేదీన జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకు పంపుతామని అవినాష్ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన అన్ని సంతకాలను డిసెంబర్ 17వ తేదీన గవర్నర్‌కు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరో వైపు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని తమ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయని గుర్తు చేశారు. అలాగే ఈ నెల 8వ తేదీ దాటినా కూడా ఉద్యోగులకు జీతాలు పడలేదని, తమ పాలనలో ఒక్క రోజు ఆలస్యమైనా రభస చేసే అనుబంధ మీడియాకు ఇప్పుడు ఈ విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చినప్పటికీ, వాటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఏమైపోతున్నాయో తెలియడం లేదని, రాష్ట్రంలో సంక్షేమం లేదు. అభివృద్ధి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News