నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 10: యువతను నిశ్శబ్దంగా కబళిస్తున్న మాదకద్రవ్యాల ముప్పుపై అవగాహన కల్పించే ప్రయత్నాల్లో భాగంగా అపోలో నాలెడ్జ్ సిటీలో బుధవారం నిర్వహించిన “సబ్స్టెన్స్ అబ్యూస్ – ది సైలెంట్ క్రైసిస్” సదస్సుకు విద్యార్థులు, అధ్యాపకులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు, భారతీయ యువతను బలహీనపర్చేందుకు డ్రగ్స్ మాఫియాలు కొత్త తరహా యుద్ధానికి తెరలేపాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—ఇండియా ప్రపంచ ఐటీ రంగంలో అగ్రగామిగా ఎదుగుతుండటంపై అసూయతో కొన్ని శత్రుదేశాలు డ్రగ్స్‌ను ఆయుధంగా మార్చుకుని యువతపై యుద్ధం మొదలుపెట్టాయని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లోనే ఆగాల్సిన డ్రగ్స్ ఈరోజు చిన్న పట్టణాల్లోని స్కూళ్ల వరకూ చొరబడటం ఆందోళన కలిగించే విషయం అని చెప్పారు. విదేశాల్లో భారతీయులు ఉద్యోగులు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలుగా ప్రాధాన్యత పొందుతున్న నేపథ్యంలో, మన మేధస్సును బలహీనపరచడానికే డ్రగ్స్ మాఫియాలు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.డ్రగ్స్ ఒక్కరి చెడు అలవాటు కాదని, ఇది దేశ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకున్న “డ్రగ్స్ యుద్ధం” అని, ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా డ్రగ్స్ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల్లో డ్రగ్స్ వ్యసన ప్రమాదాల గురించి అవగాహన పెంచేందుకు త్వరలోనే ఒక సినిమా తీస్తానని ప్రకటించారు. అలాగే, విద్యార్థులు తల్లిదండ్రుల అంచనాలకు అనుగుణంగా మంచి ప్రవర్తనతో, నైతికతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు మాట్లాడుతూ, అపోలో నాలెడ్జ్ సిటీ ఇప్పటికే ర్యాగింగ్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్‌గా నిలిచిందని, ఎమ్మెల్యే సూచించిన మేరకు దీనిని పూర్తిగా డ్రగ్ ఫ్రీ క్యాంపస్‌గా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ శాఖ, ప్రజా ప్రతినిధులు చేపడుతున్న కఠిన చర్యలకు అపోలో తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. పోలీసు శాఖ నుంచి సిఐలు మహేశ్వర్, విత్తిబాబు, నెట్టి కంటయ్య మాట్లాడుతూ డ్రగ్స్ యువతపై, సమాజంపై చూపే దుష్ప్రభావాలను ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, ఎఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జే. అగస్టీన్, యూనిట్ హెడ్ ఎస్. బాలరాజ్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





