నేటి సాక్షి,బాపట్ల జిల్లా (అద్దంకి)నార్కెట్‌పల్లి – అద్దంకి – మేదరమెట్ల (నామ్) రహదారి విస్తరణ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గత పదేళ్లుగా భూసేకరణకు అవసరమైన నిధుల మంజూరులో జాప్యం కారణంగా అద్దంకి మండలంలోని చక్రాయపాలెం,గోపాలపురం గ్రామాలు, అలాగే సంతమాగులూరు మండలం పరిధిలోని ఏల్చూరు గ్రామాల వద్ద రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయని మంత్రి వివరించారు. ఈ అంశాన్ని పలు మార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన ఈ రహదారిలో ప్రమాదకర మలుపుల కారణంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించామని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయుడు నామ్ రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణకు నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అయితే ఈ మేరకు బుధవారం నాడు నామ్ రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణకు రూ.3.44 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. రహదారి విస్తరణ కోసం మంజూరైన నిధులను త్వరలోనే చక్రాయపాలెం, కలవకూరు, గోపాలపురం, ఏల్చూరు గ్రామాల పరిధిలో భూసేకరణ నిమిత్తం నిధులను రైతులకు చెల్లించి, రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ రహదారి విస్తరణ పూర్తైతే ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణం, ఈ ప్రాంతాభివృద్ధికి ఊతం లభిస్తుందని మంత్రి గొట్టిపాటి వివరించారు.





