నేటి సాక్షి,నారాయణ పేట, డిసెంబర్ 10,ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు ఈ మానవ హక్కులు ప్రతి వ్యక్తికి కావాలని రూపొందించారని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ కె.రాములు అన్నారు. బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరికల్ మండల కేంద్రంలో పాత గ్రామపంచాయతీ దగ్గర మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించిందని దీనిని అన్ని దేశాలు పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించారని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టు లేదా మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు. భారతదేశం 1993లో రూపొందించిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా గొప్పదని ఈ రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని అన్నారు. ఈ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని కొన్ని దుష్ట శక్తులు దశాబ్దాలుగా ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మహిళలను దళిత మరియు ఆదివాసీలను మరియు అత్యంత వెనుకబడిన కులాలను బానిసలుగా తయారుచేసి పశువుల కంటే హీనంగా చూసిన మనస్మృతిని మరల పైకి తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నారు అన్నారు. ఈ క్రమంలో మరికల్ మండలం తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ మండల కోఆర్డినేటర్ జె.మానస, మరియు యూత్ కోఆర్డినేటర్ కవిత, ఉపాధి కార్మికులు లక్ష్మి, మౌనిక, వ్యవసాయ కూలీలు చంద్రకళ, శృతి, టైలరింగ్ నేర్చుకుంటున్న మహిళలు మహేశ్వరి, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.





